మహోన్నతమైన వ్యక్తులు ఐదడుగులు వేస్తే ఐదువేల అడుగులవరకు వారి దివ్యత్వం వ్యాపిస్తోంది. అమ్మ మదర్ థెరిస్సా కూడా ఈ కోవకు చెందిందే. ఎక్కడో లెబనాన్‌లో పుట్టిన ఆమె ఇండియాకు వచ్చి భారతీయులందరికే కాదు ఈ ప్రపంచానికే అమ్మ అయింది. దాదాపు 45 ఏళ్లపాటు అనాథలకు, ఆర్తులకు, దీనుల పాలిట దేవతైంది. భారతదేశంలోని కలకత్తాను కేంద్రంగా చేసుకొని ఆ మహనీయురాలు ఆరంభించిన సేవా సంస్థలు నేడు ప్రపంచ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి దీనులను ఆదుకుంటున్నాయి.
1 910 ఆగస్టు 26న మదర్ థెరీసా జన్మించి 1997 సెప్టెంబర్ 5న కన్నుమూశారు. ఆమె జన్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఈ ఏడాది మొత్తం దేశ వ్యాప్తంగా ఈ సేవామూర్తి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధులవరకు ఈ సేవామూర్తి సేవలను స్మరించుకునే రోజులివి. ఈ సందర్భంగా ఈ మహనీయురాలి జీవితంలోని కొన్ని విశేషాలు.
అమ్మ జీవితంలో ఐదు సత్యాలు
మదర్ థెరీసా తన 18వ ఏటే అంటే 1918 సెప్టెంబర్ 18న తల్లిదండ్రులను విడిచి మిషనరీని స్థాపించారు.ఆ రోజుల్లో భారతదేశం బ్రిటీష్‌వారి పాలనలో ఉంది. కలకత్తాలోని విక్టోరియా ఆర్కిటెక్చర్ ప్రాంతం విలాసవంతమైన ధనవంతులు నివాసం ఉండే ఏరియా. దీనివెనుకే పేదలు నివసించే మురికివాడ ఉండేది. ఇక్కడనుంచే మదర్ తన సేవా కార్యక్రమాలను ఆరంభించారు.
కలకత్తా నడిబొడ్డులో మదర్ ఇల్లు ఉండేది. యువ నన్స్ ఇక్కడే సేవా కార్యక్రమాల్లో శిక్షణ తీసుకునేవారు. ఈ నన్స్‌కు రెండు చీరెలు, ఒక జత చెప్పులు, ప్రార్థనా పుస్తకాన్ని ఇచ్చేవారు.
ఆరవ పోప్ పాల్ ఇండియాకు వచ్చారు. ఆ సమయంలో పోప్ పాల్‌ను మదర్ థెరీసా తన పనుల్లో బిజీగా ఉండి కలువలేకపోయారు. ఆమె సేవా కార్యక్రమాలను, పనులను గుర్తెరిగిన పోప్ పాల్ తన కారు స్వయంగా పంపి ఆమెను తన బస చేసిన నివాసానికి రప్పించుకుని ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారట.
చివరి క్షణాల్లో ఉన్న పేదలు ప్రశాంత జీవనం గడపటానికి ఓ భవనాన్ని నిర్మించాలనుకున్నారు. దీంతో ఆమె ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలియజేశారు. అధికారులు ఆమెను కాలిఘాట్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న స్థలాన్ని చూపించారు. ఆ స్థలం హిందువుల దేవాలయానికి వెనుకే ఉంది. అక్కడే ఆ మాతృమూర్తి ‘నిర్మల్ హృదయ్’ అనే పేరుతో భవనాన్ని నిర్మించారు. ‘నిర్మల్ హృదయ్’ అంటే స్వచ్ఛమైన మనస్సు అని అర్ధం. ఈ పేరును మదర్ థెరీసానే పెట్టారు.
అమ్మ ఎపుడూ అద్భుతమే: జోషి
ప్రేమను, ప్రేమించటాన్ని మనమే సృష్టించుకోవాలని మదర్ ఎపుడూ చెబుతుండేవారని, ఆమె మా కళ్లకు ఎపుడూ అద్భుతంగానే కనిపించేదని కేరళకు చెందిన మేరీ జోషి అంటారు. అతి పిన్నవయసులో మదర్ శిష్యురాలిగా చేరిన మేరీ జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని ఇలా తెలియజేశారు. 1968 మే 14వతేదీన మొట్టమొదటిసారి మదర్‌ను కలిశాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యాను. కేరళ నుంచి మేము రైలులో బయలుదేరి కలకత్తాకు 1968 మే 14న హౌరా స్టేషన్‌కు చేరుకొన్నాం. నాతో పాటు 20 మంది వచ్చారు. మదర్ నడిపే ఛారిటీ ట్రస్టుకు కొన్ని వస్తువులు ఇచ్చేందుకు వచ్చాం. ట్రైన్ దిగగానే ఎవరన్నా ట్రస్టు సభ్యులు వచ్చారా అని చుట్టూ చూశాం. తెల్లటి చీరలో నిర్మలమైన మోముతో మమ్మల్ని తీసుకువెళ్లటానికి మదర్ నిలబడి ఉన్నారు. ఆమెను చూడగానే ‘నమస్తే’ అని అన్నాం. కాని ఆమె మా అందరినీ ఆప్యాయంగా కౌగిలించుకుని స్వాగతం చెప్పారు. ఆ చేతుల్లో ఎంతో ప్రేమ దాగివుందని తెలిసింది.ఆ క్షణంనుంచి సెయింట్ మేరీ జోషి మదర్ అనుచరురాలిగా మారిపోయారు. మదర్ ఛారిటీ ట్రస్టులో జాయిన్ అయిన అతి పిన్నవయస్కురాలు ఆమె కావటం గమనార్హం. ఆమె రిజిస్ట్రేషన్ నెంబర్ 373. జోషి కలకత్తా, ఢిల్లీ, ముంబాయిలలో పనిచేశారు. ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాలపాటు మదర్‌తో కలిసి పనిచేశాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటపుడు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా రేయింబవళ్లు కష్టపడేవారు. ‘‘ఏ రోజు ఆమె విశ్రాంతి తీసుకున్నట్లుగా ఎరుగను. ఎంతో అంకితభావంతో సేవ చేసేవారు’’ అంటూ జోషి చిన్న కన్నీటి బొట్టును వదిలారు.
కుష్ఠురోగులను చూస్తే చాలు అసహ్యించుకుంటూ దూరంగా వెళ్లిపోతాం. కాని ఈ అమ్మ వారిని అక్కున చేర్చుకుని సేవ చేసేవారు. సేవా కార్యక్రమాల్లో ఉన్నపుడు అనారోగ్యానికి గురైతే వెంటనే మమ్మల్ని ఆమె మంచంపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు అని జోషి పేర్కొంది. మదర్‌కు 1979లో నోబుల్ బహుమతి లభించినపుడు భారత ప్రభుత్వం సన్మానించి, పెద్ద పార్టీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఆ హంగూ, ఆర్భాటాలను తిరస్కరించి దానికయ్యే వ్యయాన్ని చెక్కు రూపంలో తీసుకుని, ఆ డబ్బును చారిటీ ఫండ్‌లో కలిపారు. ఈ చిన్ని చిన్న జ్ఞాపకాలను మదిలో భద్రపరచుకుని వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని ఇంకా మరింత సేవ చేయటానికి శక్తిగా భావిస్తున్నానని జోషి మదర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తెలిపారు. ఇలా ఎంతోమంది ఆమె సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగాపొంది ఆమె సేవా సైన్యంలో చేరినవారు ఎందరో..
ఈ విశ్వాసానికి అమ్మగా మారిన ఈ 87 ఏళ్ళ సేవామూర్తి తన జీవితకాలంలో ఎంతోమంది శిష్యురాళ్లను తయారుచేసి అన్నార్తులకు, అనాథలకు అండగా వారి చెంత చేర్చింది
No comments:
Post a Comment